కవితా హృదయం ...

ఓ అందమైన భావన .. అక్షరాల సుమ మాల గా కూరిస్తే ఓ కవిత గా రూపు దిద్దుకుంటుంది . ప్రకృతి పరవశమైనా .. చిరుగాలి పులకితమైనా ... మయూరం నర్తించినా .. మేఘం కరిగి వర్షించినా మనసు అందమైన భావనల్లో తేలియాడుతుంది .. నా భావన .. నా ఆలోచన .. నా రచనా శైలి .. మీతో పంచుకుందామని ఇలా కవితా హృదయం
పరిచా .. నచ్చితే ముచ్చట పడండి ..

Monday, 28 April 2014

క్షమించవా నా హృదయమా ..


నీ కల నేను...........   జ్ఞాపకాల వల నేను 

నీ మనసు తీరాన్ని మరల మరల తాకే అల నేను .. 

కమ్మని కబుర్లు విన్నాను .. రమ్మను నీ పిలుపులు విన్నాను .. 

తీయని మాటలు చెప్పాను .. మాయని తలపులు విప్పాను .. 

నీ గుస గుసల అలజడి నేనేను .. నీ కస్సుబుస్సుల సందడి నాదేను .. 

నీ ఎదురు చూపు లో ప్రాణం పోసుకుంటాను .. 

నీ దారి ప్రతి మలుపునా ఎదురై నిలిచాను .. 

నీ భావి ని కావాలని ఆశించాను .. రవి నై చీకటిని తరమాలని భావించాను .. 

ఎదగూటిలో దేవత గా కొలవాలనుకున్నాను .. 

ఎప్పటికీ నీ పై నా ఆరాధనని చాటి చెప్పాలనుకున్నాను .. 

కానీ నా మాట మౌనమై .. నీనుండి దూరమై నిశీధి లో నియంత నయాను .. 

నీ వాలు కళ్ళల్లో కన్నీటిని నింపి ఆ వెల్లువలో కొట్టుకుపోయాను .. 

నీలో నను నేను కోల్పోయాను .. నాకు నేను మిగలక జీవచ్చవమై మిగిలాను .. 

ఈ మనసు లేనివాడిని క్షమించగలవా అని అడగలేని అసహాయత లో కొట్టుమిట్టాడు తున్నాను .. 


Friday, 25 April 2014

అందమైన లోకం

ఎందుకో కొత్త గా కనిపిస్తున్నది ఈ లోకం ..                                  

రోజుకో వింతలా కవ్విస్తున్నది  భూలోకం

రెక్కలు విప్పిన యవ్వనం చేసింది  గగన విహారం

రేకులు విచ్చిన పూవనం వేసింది ఓ సుమహారం

గల గల పారే సెలయేరే మంది ? నా కిల కిల నవ్వే తనదంది ..

మిల మిల మెరిసే తారక ఏమంది ? తన మిసమిస సొగసే నాదంది ..

కొమ్మల్లో కోయిలా .. కూసిందిలే ఇలా .. కుహు కుహు పాటలా .. సరిగమల తోటల  ..

మెరిసేటి వెన్నెలా .. కురిసింది జోలలా .. నిదురించు వేళలా .. కలలు నా కన్నులా ..

సరికొత్తగా .. గమ్మత్తుగా ఊయలూపింది లోకమే ఇలా ..


పూవు ల భాష ఏదో .. తుమ్మెదా..  నీకు తెలుసేమో ..

చిరుగాలి ఊసుల్ని వింటూ పైరు తల ఊపుతుందేమో ..

నింగి చెక్కిలి పైన .. సిగ్గు ఒలికించు స్సూరీడు .. మబ్బుల చీర తెచ్చి .. కానుకే ఇచ్చి ఉంటాడు .

వేకువ వాకిలి లోనా .. ముగ్గు పెట్టేవాడు .. హరివిల్లు రంగులు కూర్చి .. చిరుజల్లు కురిపించుంటాడు ..

ఆనందమా .. ఆహ్లాదమా ? ఈ జగతిలో ఇంతందమా ?

పచ్చాని రాచిలుక  కమ్మని పలుకులా

మా వూరి రహదారి మెలికల  కులుకుల ..

సిరి మువ్వ సవ్వళ్ళ..  దోబూచు లాట లో  .. గోధూళి వేళలో .. కన్నె దూడ సంబరాలు

సందె పొద్దు నీడలోనా  .. .. తెల్లవారు పల్లె లోనా  .. మంచు జాణ ఇలకి చేర .. విచ్చు  మందారాలు

చాలవేమో కళ్ళు రెండు .. సొగసులద్దిన ప్రకృతిని చూడ ..

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

ఏమని చెప్పను ?నేనెవరంటే ఏమని చెప్పను ?

నిశ్చల మైన సరస్సులో తరంగమని చెప్పనా ?

మేఘాన్ని కరిగించే చిరుగాలి నని చెప్పనా ?

తొలకరి జల్లు కి మురిసే అవని నని చెప్పనా ..

శిశిరపు విరహాన్ని తాళలేని వనాన్ని కౌగలించే వసంతాన్నని చెప్పనా ?

నింగి వీడి నేల జారిన ముత్యపు చినుకునని చెప్పనా ?

మావిచివురు తిని తీయగ పాడే కోయిలనని చెప్పనా ?

నీలాకాశం లో విహరించే విహంగాన్నని చెప్పనా ?

తొలిపొద్దు కిరణాల  చుంబన లో మురిసే జలపాతమని చెప్పనా ?

నెలరేడు ప్రణయ దాహాన్ని తీర్చే కోనేటి కలువనని చెప్పనా ?

అలుపెరగక సాగే  నదీమ తల్లి ప్రవాహ వేగాన్నని చెప్పనా ?

తుంటరిగా పూవన మంతా తిరిగే సీతాకోక చిలుక నని చెప్పనా ?

భావాల  వెల్లువని కవిత గా మలచే శిల్పి నని చెప్పనా?

 ఈ అంతర్జాలం లో ఇంద్రజాలం చేసి మీ మనసుల్ని దోచుకోవాలని వచ్చానని చెప్పనా ?

ఏమని చెప్పను ?
www.facebook.com/Naarachana

సొంతిల్లు

ఇటుక ఇటుక పేర్చినపుడు కార్చి నట్టి చెమట బొట్టు ..

కష్టమంతా పోగు చేసి కనుల కారే నీటి బొట్టు ..

అలుసు గ చూసేటి వాళ్ళ ప్రవర్తన కి చెంప పెట్టు ..

సొంత ఇంటి కల నెరవేరే రోజు న బంధువులకి నుదుట బొట్టు

పెట్టి, ఇంట పండగ కి రారండని మొదలు పెట్టు ..

ఆశల సౌధం లోనా మొదట లక్ష్మి కాలు పెట్టు ..

తీరని కోరిక తీరిన సంతోషం మొహాన వెలుగు నింపి నట్టు  ..

కోరిన గూటికి చేరిన చిలకల జంట గా మారినట్టు ..

చిన్నదైనా పెద్దదైనా సొంతిల్లు స్వర్గామౌను అంటు ..

చిన్న పెద్దలందరితో ఆనందపు లోగిలిలో  సంతసం గా జీవించమంటూ ..

ఆశీస్సులు అందుకోరా చిరకాలం సుఖమయమవునట్టు ;
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 22 April 2014

ఎడబాటుక్షణమొక  యుగమవుతుందంటే నమ్మలేదు ..

నీకోసం ఎదురుచూస్తుంటే అర్థమవుతుంది ..

యుగమొక క్షణం కాగలదంటే ఎలా అనుకున్నా ..

నీతో గడిపిన జ్ఞాపకాలు తెలిపాయి కాలమెలా గడచిపోయిందో ..

మనసు లోతుల్లో  బరువు ఎడబాటు భారం అని తెలిసి ..

ఆ భారాన్ని మోయలేని మనసుకి సర్ది చెబుతున్నా ..

ఈ దూరం తరిగిపోయేదే అయినా .. తేలికగా తీసుకోలేకున్నా ..

ఆకాశం ఆవలి అంచున మెరిసే మేఘాన్ని అడుగుతున్నా ..

కాస్త నీ క్షేమాన్ని తెలపమని ..

నా ఎదురుచూపులన్ని తనపై చిరు చినుకుల్లా కురిపించమని ..

రాత్రైతే నింగిన చుక్కలతో మాట్లాడుతున్నా ..

నీ నవ్వుల తళుకు ని  వాటిలో  చూప మని ..

నిను చూపలేని కనులని తిడితే కలలో నువ్వొస్తావని చెప్పాయి ..

నీ  మాట వినలేని వీనుల నడిగితే చిరుగాలి తో కబుర్లు వస్తాయన్నాయి ..

ఏమో నీ సామీప్యం కన్నా గొప్ప ధైర్యం ఈ లోకం లో నాకేది ఇస్తుంది ?


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 19 April 2014

సహకారం

కంటి నీరు ఉబికి ఉబికి రెప్పగట్టు దాటగా ..

చెక్కిలమ్మ చేరదీసి తనలోన దాచగా ..

ఒదిగి పోయి మచ్చతెచ్చె ఆ కన్నీటి చారికా ..

గుండె లోన దుః ఖ మంతా అలల సుడులు తిరగగా ..

ఉప్పెనైన సంద్రమల్లె అశ్రుధార కురియగా ..

చెక్కిలమ్మ బెదిరిపోయి మోము చిన్నబోవగా ..

హస్తమొచ్చి నీరు తుడిచి చేదోడై నిలిచెగా ..

కష్టమొస్తే కంట నీరు సంతోషమైతే పెదవి తీరు

ఒకరి కొకరు తోడు కాగా సందేశ మేదో చెప్పకనే చెబుతోంది గా

అవయవాల నడుమ కూడా సహకారముండగా

మనిషి కొరకు మనిషి రాడు యిదేమీ చోద్యమో కదా

Monday, 7 April 2014

ఆశ చిగురు వేసింది

వేసవిలో చిరుజల్లులా .. 

చీకటిలో చిరు వెలుగులా .. 

శిశిరం లో మొలక చిగురులా .. 

ఆశ మిణుకు మిణుకుమంటోంది .. 

కరిమబ్బు కరిగి వర్షమై కురిసినట్టు .. 

చిరుగాలి ఆత్మీయంగా స్పర్శించి నట్టు .. 

ఉప్పెనైన కన్నీటికి ఆనకట్ట వేసి నట్టు .. 

ఎడతెగని సంతోషానికి దారేదో తెలిసి నట్టు .. 

శ్వాస ఎగసిఎగసి పడుతోంది .. 

మంత్రమేదో వేసినట్టు .. 

లోకాన్ని జయించేసి నట్టు ,,,

అదృష్ట దేవత వరించినట్టు .. 

వరములెన్నొ కురిపించినట్టు .. 

కల కనుల లోగిలి చేరుతోంది .. 

ఇవన్నీ నిజమో కాదో .. కానీ చెలియా నీ పరిచయం 

ఎడారి లో ఒయాసిస్సై నా దాహాగ్ని ని చల్లార్చింది .. 

స్నేహం అను బంధం లో రుచిని నాకు తెలిపింది .. 

ఆశ చిగురు వేసింది ............. 


Friday, 4 April 2014

ఆమని కోయిల

చిగురాకు రెమ్మల్లో కూసింది లే కోయిలా

చిరుగాలి తాకిడి కె ఊగింది కొమ్మ ఊయలా ..

కంగారు పడకే చిలిపి కోయిలా .. బంగారు మనసున్నచిన్నారి కోయిలా

నీ ఎదురుచూపులన్ని ఆమని రాక కై కదా ..

ఓ వాసంత వీచిక రాగా బెదిరిపోతే ఎలా ..

నిను కోరి వచ్చే ప్రేమ మాసం .. రాగాల ఊయల ఊపే ఈ చైత్ర గీతం

మధుర రసమేదో ఒలికించి గొంతులో ,కుహు కుహు పాటలతో  అందించు  గానామృతం

మావిచివురే తిని మధువు మదిలో కని మండుటెండ నైనా కూయవే కోయిలా

వేసవి వడగాల్పుల్లో తీయని  రాగం తీసి చిరుగాలి అలల తేలవే ముద్దుల కోయిలా

నీ గొంతు వింటే పరవశ మొందని హృదయము ఉండదు ..

నీ శృతి లో జతి కావాలనుకోని రాగం ఉండదు ..

ప్రణయ ఝంఝా మారుతం లా నీ కూత అలా ప్రకృతి కన్యని పులకరింప జేయదా ..

వాసంతం కురులు విప్పి ఆనంద తాండవం చేయగా వడివడిగా తరలి రాదా ..

రూపవిహీనమైన గానీ మధుర గానాన రాణీ .. నీకు సాటి వేరెవరు లేని గాన సుధ వి నీవే కానీ


అభిప్రాయం మాకు అతి విలువైనది

విఫల ప్రేమ

విడదీయగలవేమో నా మదిని ,తనువుని 

అతికించలేవమ్మ విరిగిన నా మనసుని .. 

చెదరగొట్టగలవేమో నేను కన్న కలలని .. 

చెరపనేలేవమ్మ గుండెల్లో జ్ఞాపకాలని .. 

చేదుగా ఉన్నా నీ తలపు రుచి ని వద్దని చెప్పలేని నిస్సహాయుణ్ణి .. 

కుదురుగా లేని నా మనసు గతిని హేళనే చేయవద్దని నీకు నా మనవి .. 

విఫల మైన .. సఫల మైన..  ప్రేమకి ఫలితం కన్నీరే .. 

గుర్తు లేదా చేసుకున్న బాస కి ద్రోహం నీ తీరే .. 

ఎదురు చూసిన కన్నుల తడిని కనలేని ప్రేయసి .. 

మోసమే నీ స్నేహమైతే తీర్చేసుకో కసి .. 

మనసు పొరల్లో రూపు దిద్దుకున్న అపురూప సౌందర్యాన్ని 

సొగసు తెరల్లో దాగి ఉన్న వంచన అని అనలేను గానీ .. 

నీ  ప్రేమ మైకం లో మునిగి లోకాన్ని మరవటమే తప్పు .. 

శాపమో వరమో .. నిన్నిపుడు మరవటమే ఒప్పు వీక్షకులతో ఓ మాట :  ప్రేమ లో విఫలమవట మంటే అదేమంత పాపం కాదు . ఆ ఓటమిని అంగీకరించి గెలుపు 

కోసం అడుగు  ముందు కేయటమే సరైనది . ప్రేమంటే .. ప్రియురాలినుండో ,ప్రియుని నుండో మాత్రమే పొందేది కాదు 

అమ్మ నుండి ,నాన్న నుండి , చెల్లి , తమ్ముడు ,అక్క ,అన్న .. ఎన్నో బంధాలు ఉన్నాయి ప్రేమని పంచటానికి . 

ఇన్ని బంధాలు పంచె ప్రేమని కించపరచి వేరెవరి ప్రేమో దక్కలేదని క్రుంగిపోవటమో ,పగతీర్చు కోవటమో లేక 

ప్రాణాలు తీసుకోవటమో సరి అయినదేనా .... ? కాదు .. జీవితం లో ఇంకెన్నో బంధాలున్నాయి .. ఇంకెన్నో 

పరిచయాలుంటాయి .. అవి బంధాలై పెనవేసుకుంటాయి . వేచిచూడండి .. ఏదీ ఎవరికోసం ఆగదు .. మీ జీవితం 

కూడా ఆగిపోదు .. మీరు ఆపకండి .. ముందుకి సాగిపోనివ్వండి .. ఈ నా మాటలు ప్రేమ మత్తులో పడి జీవితాల్ని 

నాశనం చేసుకుంటున్న చెల్లెళ్లకి , తమ్ముళ్ళకి ,స్నేహితులకి .. అర్థం అయింది కదూ .. 


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది