కవితా హృదయం ...

ఓ అందమైన భావన .. అక్షరాల సుమ మాల గా కూరిస్తే ఓ కవిత గా రూపు దిద్దుకుంటుంది . ప్రకృతి పరవశమైనా .. చిరుగాలి పులకితమైనా ... మయూరం నర్తించినా .. మేఘం కరిగి వర్షించినా మనసు అందమైన భావనల్లో తేలియాడుతుంది .. నా భావన .. నా ఆలోచన .. నా రచనా శైలి .. మీతో పంచుకుందామని ఇలా కవితా హృదయం
పరిచా .. నచ్చితే ముచ్చట పడండి ..

Tuesday, 22 April 2014

ఎడబాటుక్షణమొక  యుగమవుతుందంటే నమ్మలేదు ..

నీకోసం ఎదురుచూస్తుంటే అర్థమవుతుంది ..

యుగమొక క్షణం కాగలదంటే ఎలా అనుకున్నా ..

నీతో గడిపిన జ్ఞాపకాలు తెలిపాయి కాలమెలా గడచిపోయిందో ..

మనసు లోతుల్లో  బరువు ఎడబాటు భారం అని తెలిసి ..

ఆ భారాన్ని మోయలేని మనసుకి సర్ది చెబుతున్నా ..

ఈ దూరం తరిగిపోయేదే అయినా .. తేలికగా తీసుకోలేకున్నా ..

ఆకాశం ఆవలి అంచున మెరిసే మేఘాన్ని అడుగుతున్నా ..

కాస్త నీ క్షేమాన్ని తెలపమని ..

నా ఎదురుచూపులన్ని తనపై చిరు చినుకుల్లా కురిపించమని ..

రాత్రైతే నింగిన చుక్కలతో మాట్లాడుతున్నా ..

నీ నవ్వుల తళుకు ని  వాటిలో  చూప మని ..

నిను చూపలేని కనులని తిడితే కలలో నువ్వొస్తావని చెప్పాయి ..

నీ  మాట వినలేని వీనుల నడిగితే చిరుగాలి తో కబుర్లు వస్తాయన్నాయి ..

ఏమో నీ సామీప్యం కన్నా గొప్ప ధైర్యం ఈ లోకం లో నాకేది ఇస్తుంది ?


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది