కవితా హృదయం ...

ఓ అందమైన భావన .. అక్షరాల సుమ మాల గా కూరిస్తే ఓ కవిత గా రూపు దిద్దుకుంటుంది . ప్రకృతి పరవశమైనా .. చిరుగాలి పులకితమైనా ... మయూరం నర్తించినా .. మేఘం కరిగి వర్షించినా మనసు అందమైన భావనల్లో తేలియాడుతుంది .. నా భావన .. నా ఆలోచన .. నా రచనా శైలి .. మీతో పంచుకుందామని ఇలా కవితా హృదయం
పరిచా .. నచ్చితే ముచ్చట పడండి ..

Thursday, 13 November 2014

నీతోనే నీ పోరాటం

నీ కనులలో కనిపించని చిరునవ్వుల నెతికా .. 

నీ పెదవులపై కమ్మని కల గురుతుల నెతికా .. 

కనరాని నిజమేదో కన్నది నా హృదయం .. 

ఎనలేని స్నేహాన్ని ఇవ్వాలని నేస్తం .. 

నీ గుండెకే ఓదార్పు నేను .. నీ అడుగు తో అడుగేస్తున్నాను 

కలిసే చేద్దాము లోకం తో యుద్ధం .. చిరకాల సమరానికి మన మనసులు సిద్ధం  -నీ కనులలో 

బడబాగ్ని దాచింది ఆ సంద్రమయితే .. 

నిలువెల్లా ఉప్పని కన్నీరే రూపయితే .. 

అలలల్లె నవ్వింది .. నింగి కి కడలగెగసింది.. 

హృదయాన్నే కాల్చేటి బాదే నీదయితే .. 

ఉదయాన్నే వెలివేసే వేదన నిను ముంచితే .. 

వెలుగుల్నే నీకిస్తా ..నీడగా నే తోడుంటా .. 

ఆకాశమంటే అoతె రుగని శూన్యం .. 

కొలవగలవా ఆ తీరం .. దూరం ..

 ఊగిస లాడకే ఓ మనసా .. నచ్చచెప్పవె నీ మది కీ ..         నీ కనులలో 


నటరాజు సిగలో జలపాతం .. నేలని తాకటం మానవ యత్నం .. 

సాధించటం నీ అభిమతం .. అయితే వెనుదిరిగి చూడకు ఏ మాత్రం .. 

కలలే కంటూనే నిదురిస్తూ ఉంటామా ?

కనులే తెరచి నిజమును కనమా ?

కన్నీటి కొలతెంతో లెక్కలు వేస్తుంటామా ?

చేరాల్సిన గమ్యం ముందర చూస్తామా ?

నీలోను ఉన్న శత్రువు నీవేలే .. నిన్నే నమ్మేది నువ్వేలే .. 

కనిపించని విరోధి తో పోరాటం చెయ్యాలి .. 

విషమించిన ఆవేదనని అంతం ఇక చేయాలి .. 

పొగమంచు పోయే ముందు ఈ శోధన తప్పదులే .. 

నునువెచ్చని కిరణాలు  లోకాన్ని మేల్కొలుపులే .... - నీ కనులలో   

    
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 5 November 2014

నిస్పృహ

ఎందుకో మనసు  మూగబోతుంది .. 

నా మదిలో  నిశ్శబ్దం నన్నే కలవర పెడుతోంది .. 

కన్నీటి అలలు ఎంత చెంప తడిమినా .. 

 గుండె భారం దిగను పొమ్మంది .. 

పెదవులపై మాటలతో యుద్ధం మౌనమే గెలిచినట్టుంది .. 

నింగి కృంగి నేల పై నిస్సహాయంగా పడుతున్నట్లుంది .. 

గాలి స్తంభించి కాలం ఆగిపోతున్నట్లుంది .. 

ఊపిరి శబ్దం కూడా ఉండుండి భయపెడుతోంది .. 

ఎందుకిలా ఉందంటే మూగగా రోదిస్తున్న హృదయం చెప్పింది .. 

నిన్ను నువ్వే కోల్పోయావే పిచ్చిదానా అని .. 

నిజమే ఈ క్షణం అర్థమయింది నాలో నేను లేనని .. 

కూలిపోయిన ఆత్మవిశ్వాసపు గోడల మీద .. 

చిరిగిపోయిన చిత్రపటం లా .. 

ఒంటరితనపు శిశిరం లో మోడువారిపోయిన వాసంతాన్నని .. 

ఓటమి , గెలుపుల మధ్య అంతరాన్ని అయ్యానని .. 

మొక్కని వీడి రాలిపోయిన పూల సుగంధాన్ని నేనేనని .. 

తెలుసుకున్నా .. చితికి పోయిన ఆశ కిక ఆయువు లేదని ...        

నిరాశా నిస్పృహ ల నడుమ జీవితం ఊగిస లాడుతుందని .. 


Wednesday, 29 October 2014

చీకటి నింపిన ఉదయం

ఎదురుచూస్తున్నా నేస్తం .. నువ్వొస్తావని ...

తారలన్నిఒక్కసారి  అదృశ్యమయ్యే  వేళకి  ..

కలువలన్ని తమలో తాము ఒదిగిపోయే వేళకి ..

తూరుపు నుదుటిన  కుంకుమ మెరిసే వేళకి ..

కిలకిలారావాల సంగీతం వినిపించే వేళకి ..

గోధూళి నేలమ్మ కి రంగులద్దు తున్న వేళకి ..

దరికి చేరనివ్వని నన్ను చూసి నిదురమ్మవిసుగెత్తే వేళకి ..

విచ్చుకుంటున్న పూల సువాసన నాసిక ని తాకే వేళకి ..

వెలుగు రేఖలు అవని నిండా పరచుకుంటున్న వేళకి ..

నేను నీకోసం ఎదురు చూస్తున్నా ..

తూరుపు సూరీడు తో పాటే వస్తావని ..

నా బ్రతుకున కాంతులు వెదజల్లుతావని ..

ఆ కాంతి లో జీవితం అంతా గడిపేయాలని ఆశ ..

రెపరెపలాడిస్తున్న కనురేప్పల్లోంచి కలలు వేల్లువవుతున్నాయి ...

మునిపంట నొక్కిన పెదవి నిను చూసే దాకా విచ్చుకోనంది ..

ఇంతలోనే తెలిసింది గుండె పగిలే నిజమొకటి ..

నువ్వు వస్తున్నావు నాకోసం .. కానీ విధి ఆట ఆడింది .

రహదారి అంతా నీ నెత్తుటి వరద నా ఆశల్ని గండి కొట్టింది  ..

గిలగిల లాడుతున్న ప్రాణం విలవిల లాడింది ..

వేరొకరి నిర్లక్ష్యం నీ ప్రాణాన్ని ఎత్తుకెళ్ళింది ..

నన్ను చూడాలనే ఆశ నీ జీవం లేని కళ్ళలో అలాగే ఉంది ..

నా అడుగుల కింద భూమి కంపిస్తుంది ..

కలలు వెల్లువైన కళ్ళలో కన్నీటి సంద్రం  ఉప్పొంగుతుంది  

గుండె వేగం ఆగిపోతున్నట్టు ఉంది ..

నీ రూపమే కళ్ళ ముందు మెదలు తుంటే ..

గ్రహణం పట్టినట్టు లోకమంతా చీకటై పోయింది ..
- రోడ్ పై వాహనాలు నడిపే టప్పుడు , మీకూ కుటుంబం ఉన్నట్లే అవతలి వారికీ ఉంటుందని గుర్తుంచు కొండి .

ఏ ఒక్కరి నిర్లక్ష్యం , దుర్వ్యసనం వేరొకరి జీవితాలలో చీకట్లు తేకూడదు .

మీ ఇళ్ళల్లో మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు .. వారి ని ప్రేమించే వ్యక్తి గా వారి ఎదురు చూపుల్ని వృధా

కానివ్వ కండి . రోడ్ ప్రమాదాల్ని అరికడదాం .
 


Wednesday, 17 September 2014

మా తల్లి గోదావరీ

దివి నుండి భువికి వలస వచ్చిన విధంబుగా .. ..

ఇల నలవోకగా  కౌగిలించిన ప్రావాహిగా ..

దక్షిణ గంగగా .. పిలవబడేవు గా .. 

ఉరుకుల పరుగుల  తల్లీ గోదారిగా ..

రాజ మహెంద్రిన అనంత వాహినిగా ..

హరిత సస్య ములకు నీవు హేతువుగా ..

ప్రవహించినావు జీవ జలధారగా ..

రాముని చరణములు తాకిన  పునీతగా .. 

పొంగి పరవళ్ళు తొక్కేవు గౌతమీ రూపుగా .. 


వరి ని పండించు గోదావరిగా .. 

పచ్చని ప్రకృతి కి ఆలంబనగా .. 

పాపి కొండల నడుమ పారాడు ముగ్ధగా 

సాగేవు మును ముందుకే కడలి దిశ గా .. 

తల్లి గోదావరీ .. సస్యశ్యామలము చేయగా .. 

ఆంధ్ర నడిబొడ్డున కొలువు తీరావు స్వయముగా .. 

అభివందనం తల్లి గోదావరీ .. 

శుభ మంటూ దీవించగా  .. వరి చేలు పండించగా  .. 

కరువు కాటకములకు తావివ్వక .. 

ప్రవహించు .. ప్రవహించు గోదావరీ .. 

తలవొంచి నిను కొలిచే చేలో వరీ .. 

 చిరుగాలి వింజామరలు వీచగా .. తెరచాపలే చీరల్లె మారగా 

ఉదయించు సూర్యుడే నిను చుంబించగా .. 

ఎర్రబడిన వదనమే అలల రూపుగా .. 

జీవనాధారమై .. జీవన రాగమై .. 

నిలిచావే .. నిలిచావే గోదావరీ .. 

పరుగుళ్లు పెట్టావే గోదావరీ .. 

మా తల్లి గోదావరీ .. పుష్కర స్నానమే పుణ్యమేగా మరీ ........  
Sunday, 7 September 2014

కవితా హృదయం ... : పశ్చాత్తాపం

కవితా హృదయం ... : పశ్చాత్తాపం: నిట్టూర్పులో నను వీడకే నా శ్వాస నీవేనులే ..  ఓదార్పులా నన్ను ఒడి చేర్చవే నీకన్న తోడెవ్వరే..  నాలోని నాకే తెలిపావు నువ్వే ..  నీలోని...

పశ్చాత్తాపంనిట్టూర్పులో నను వీడకే నా శ్వాస నీవేనులే .. 

ఓదార్పులా నన్ను ఒడి చేర్చవే నీకన్న తోడెవ్వరే.. 

నాలోని నాకే తెలిపావు నువ్వే .. 

నీలోని మనసే ఇచ్చేసావే .. 

నాపైన నాకే నమ్మకమే పెంచావే .. 

నీ జీవితం పంచినావే .. 

నీలో ప్రేమ నా అస్తిత్వం అని తెలియక నేనే .. 

నీలో నన్నే నిలువునా చంపేసానే .. 

విరబూసిన ప్రేమ నే నలిపేసానే .. 

అహం తో నిన్నే అవమానించానే .. నానీడ కె సెలవు ఇచ్చానే .. 

మితిమీరిన స్వార్థం తో నిన్నే కాదన్నానే .. 

మౌనంగా వేదన పడ్డావే .. 

నను వీడలేక .. నచ్చచెప్పలేక .. నువు చూసిన ఆఖరి చూపే .. 

నను నిలదీస్తుంది చూడవే .. 

అసహాయతoతా నిన్ను అల్లుకుంటే నానుండి దూరంగా 

బాధే గుండెల్లో అదిమి పెట్టావే .. 

ఈనాడు నేను ఒంటరి నయ్యాను .. వెలుగే ఎరుగని లోకం లో ఉన్నాను 

తొలిగాక ఆ మబ్బు పొరలు .. నాతో నువు లేని దిగులు .. 

అహం వీడి పోయింది మొదలు .. నీ జ్ఞాపకాల దొంతరలు .. 

చెప్పాయి నాకే నే చేసిన తప్పిదాలు .. 

తీసేసాను ప్రేమకి కప్పిన పరదాలు .. 

కానీ .. నువ్వు లేవు నా చెంతనే .. వేరొకరి పరమయ్యావు నావల్లనే .. 

నాలోని నీ వల్లనే .. వెలుగు చేరింది నా కళ్ళనే .. 

నువ్విచ్చిన నీ మనసు తోనే దీవించనా స్నేహమా .. 

నూరేళ్ళు వర్ధిల్లు నీవని .. నను మరచి జీవించు .. పీడకల నేనని .. 
    

Monday, 25 August 2014

తొలకరిప్రేమ

ఆకాశ వీధి లో అలా .. అందాల చందమామలా .. 

వేసింది లే వలా .. చెలి సన్న జాజిలా .. 

ఘుమఘుమల సౌరభాల జోలలా .. 

మధురోహల సంతకాలలా .. చేసేటి వేళలా .. 

మది వెలుపల వేచి ఉన్నదేమో అతిథి లా .. 

తెరిచెను తలుపులు తలపలా .. ఆహ్వానం తెలుపలా 

అంటూ మనసుకి తెలిపిన వయసు చురుకలా .. 

తానోచ్చే ఓ పరువం లా .. కలిసొచ్చే పరిచయం లా .. 

కమ్మేసే ఆ మబ్బుల్లా .. నే గగనం అయితే తానే నిలువెల్లా .. 

కురిసే పొగమంచుల్లా .. నన్నే దాచేసావే చలికాలపు ఉదయం లా .. 

ఆషాడపు చినుకుల్లా .. వాసంతపు చిగురుల్లా .. 

నువ్వు నాలో ప్రేమని మొలకెత్తించు ఇలా .. 

విరబూసిన హృదయం లా .. వరమిచ్చిన సమయం లా .. 

నువ్వు నన్నే కలిసావే నా ప్రతిబింబం లా .. 

హేమంత తుషారం లా .. అరవిచ్చిన కుసుమం లా .. 

ముద్దోచ్చావే ఆనందానికి ప్రతిరూపం లా .. 

మధుర సంగీతం లా .. ఉరికే జలపాతం లా .. 

నను ఉక్కిరి బిక్కిరి చేశావే తొలకరి ప్రణయం లా ...