కవితా హృదయం ...

ఓ అందమైన భావన .. అక్షరాల సుమ మాల గా కూరిస్తే ఓ కవిత గా రూపు దిద్దుకుంటుంది . ప్రకృతి పరవశమైనా .. చిరుగాలి పులకితమైనా ... మయూరం నర్తించినా .. మేఘం కరిగి వర్షించినా మనసు అందమైన భావనల్లో తేలియాడుతుంది .. నా భావన .. నా ఆలోచన .. నా రచనా శైలి .. మీతో పంచుకుందామని ఇలా కవితా హృదయం
పరిచా .. నచ్చితే ముచ్చట పడండి ..

Monday, 25 August 2014

తొలకరిప్రేమ

ఆకాశ వీధి లో అలా .. అందాల చందమామలా .. 

వేసింది లే వలా .. చెలి సన్న జాజిలా .. 

ఘుమఘుమల సౌరభాల జోలలా .. 

మధురోహల సంతకాలలా .. చేసేటి వేళలా .. 

మది వెలుపల వేచి ఉన్నదేమో అతిథి లా .. 

తెరిచెను తలుపులు తలపలా .. ఆహ్వానం తెలుపలా 

అంటూ మనసుకి తెలిపిన వయసు చురుకలా .. 

తానోచ్చే ఓ పరువం లా .. కలిసొచ్చే పరిచయం లా .. 

కమ్మేసే ఆ మబ్బుల్లా .. నే గగనం అయితే తానే నిలువెల్లా .. 

కురిసే పొగమంచుల్లా .. నన్నే దాచేసావే చలికాలపు ఉదయం లా .. 

ఆషాడపు చినుకుల్లా .. వాసంతపు చిగురుల్లా .. 

నువ్వు నాలో ప్రేమని మొలకెత్తించు ఇలా .. 

విరబూసిన హృదయం లా .. వరమిచ్చిన సమయం లా .. 

నువ్వు నన్నే కలిసావే నా ప్రతిబింబం లా .. 

హేమంత తుషారం లా .. అరవిచ్చిన కుసుమం లా .. 

ముద్దోచ్చావే ఆనందానికి ప్రతిరూపం లా .. 

మధుర సంగీతం లా .. ఉరికే జలపాతం లా .. 

నను ఉక్కిరి బిక్కిరి చేశావే తొలకరి ప్రణయం లా ...   

Wednesday, 20 August 2014

ప్రేమ విరిసేలా

అతడు : నీలి మేఘ మాలా ... ఎందుకో ఈవేళా ...

మధుర జ్ఞాపకాలు పంచుతోంది ఇంతలా ..

స్నేహ పరిమళాలా .. వలపు సౌరభాలా ..

ఎదురు చూసిన తీయనైన భావాలా ?

అడుగు నేల మీదే ఉన్నా .. గాలి లోన ఉన్నట్టుంది ..

గుండె బరువు పెరుగుతూ ఉన్నా .. తనువు దూది పింజయ్యింది ..

కొత్తగా లోకం పలకరిస్తున్నది .. మత్తు లాంటి మైకం కమ్మేస్తున్నది ..

ఇది నీ లీలా .. ప్రియురాలా .. మధు బాలా ..

ఆమె :అద్దమెoదుకో నను కొత్తగా చూపుతోంది ..

అడ్డమెందుకో అనుకుందో బాల్యం చేజారిపోయింది ..

వసంతాల యవ్వనం తొలిసారి పలకరిస్తుంది ..

చిగురు తొడుగు సోయగం విరజాజి మల్లె పూసింది ..

ఇంతలోనే నీ పరిచయం నన్ను మాయ చేస్తుంది ..

మది నిలవాలా .. ఓ దిల్వాలా .. నిను చేరే అలా ..

:నీ అడుగుల సడి వినగానే ఓ అలజడి మొదలే నా  ఎద లో ..

:ఆ అలజడి మొదలవగానే నీ రూపం మెదిలే హృది లో  ..

:నువ్వు నేనూ ఒకరికి ఒకరం

: ఇరువురిలోనూ ఒకటే హృదయం ..

: ఆడిన వేళా మనసు మయూరం ..

: తాకినదేమో ప్రణయ సమీరం ..

అ: ఓ వెన్నెలా .. కబురంపవే నా కలా .. నా చెలి ఊహల వెల్లువలా

ఆ: ఈ కన్నులా .. చేరిన నీ కలా .. నిజమయ్యేనో రేపటికల్లా ..

అ :బంగరు స్వప్నం నిజమవు వేళా .. ఆ దైవం దీవించునలా ..

:ఆ దీవెనలే ఫలియించేలా .. నీ తోడై నను చేరనీ ఇలా ..

:కొమ్మల్లో కూసిన కోయిలా ..పిలుపు విన్న  ఆమని రాక లా ..

: ఆమని రాకకై వేచిన వనములా .. విరబూసినదా  నందనమే ఇలా ..

అ :నీలి మేఘమాలా .. ఎందుకే ఈవేళా ...
Monday, 18 August 2014

చల్లగ కురిసెను వెన్నెలా .       చల్లగ కురిసెను వెన్నెలా .. ఆ జల్లు కి తడసినదీ ఇలా ..

       పున్నమి  జాబిలి జిలుగులా ... సిరి వన్నెల పూతల తళుకులా  ..

       ఆ చంద్రుని నుండి జారిన ముత్యపు తునకల వానలా ...

       చీకటి నిండిన నింగిలో ముద్దొచ్చే వదనపు వెలుగులో ..

       అరవిచ్చిన గగనపు సీమ లో .. కొలువయిన తారల సేవలో ..

      పరచిన మబ్బుల తివాచీ .. పై రాచ ఠీవి ని ఒలికించి ..

      అంతరిక్షమే వీడి భువి న విహరించే వెన్నెలా .. వెలగవే మా కన్నుల .


      మెల్లగా ఇటువైపుగా తొంగి చూడకే అలా ..

      నిను దాచటం తన తరమా ఓడిపోదా మేఘమాల   .

      అల్లరి చిరుగాలితో స్నేహం చేసుకో ఇలా ..

      నునువెచ్చని అనుభూతి ని కలిగించు వెన్నెలా ..

      తళుకు మన్న తార కౌగిట కరిగుపోవు జాబిలి ప్రేమలా ..

      మిణుకు మన్న గ్రహాల సందిట పంచుకున్న తీపి ఊసులా ..

      వెల్లువైన విరహాల శుక్ల పక్షా న .. తుళ్లు తున్న యామినివై విస్తరించలా ..

      సంద్రమైనా , వనమైనా పులకరించు వేళలా ..

      వెన్నెలా .. సిరివెన్నెలా .. కురవాలి గా జడివానలా ..
    

Wednesday, 13 August 2014

ఎందుకు ?


తీయనైన కలలు కన్న కనుల నుండి జాలు వారు

కన్నీరు ఉప్పన .. ఎందుకు ?

కమ్మనైన మాటలెన్నో చెప్పిన నీ మనసు నాకు

చేదు జ్ఞాపకాలు పంచె నెందుకు ?

మధుర మైన వలపు లోన వగరు సెగల అలజడేందుకు ?

నమ్మకాన్ని వమ్ము చేసి బ్రతుకు తీరు మార్చావు ఎందుకు ?

అతివ గుండె వెన్నగాని, వెన్నుచూపి వెళ్ళిన నిన్ను క్షమించుటేందుకు ?

మరలి రాని తోడు నువ్వు .. నీడ లాగ భయపెడుతుoటావు ఎందుకు ?

వాడిపోయిన ఆశ లెన్నో .. చిగురు తొడగని జీవితాన వసంతం కై ఎదురు చూపులెందుకు ?

చినుకు లాంటి ఓదార్పు కోరిన బీడుబారిన మనసు లోన ఆషాడ మెప్పుడు రాదు ఎందుకు ?

కక్ష గట్టిన విధి యె ఇప్పుడు సంఘర్షణ నాలో రేపుట ఎందుకు ?

అంతు తెలియని ప్రశ్న లెన్నో నన్ను నిలదీయుటేందుకు ?