కవితా హృదయం ...

ఓ అందమైన భావన .. అక్షరాల సుమ మాల గా కూరిస్తే ఓ కవిత గా రూపు దిద్దుకుంటుంది . ప్రకృతి పరవశమైనా .. చిరుగాలి పులకితమైనా ... మయూరం నర్తించినా .. మేఘం కరిగి వర్షించినా మనసు అందమైన భావనల్లో తేలియాడుతుంది .. నా భావన .. నా ఆలోచన .. నా రచనా శైలి .. మీతో పంచుకుందామని ఇలా కవితా హృదయం
పరిచా .. నచ్చితే ముచ్చట పడండి ..

Wednesday 29 October 2014

చీకటి నింపిన ఉదయం

ఎదురుచూస్తున్నా నేస్తం .. నువ్వొస్తావని ...

తారలన్నిఒక్కసారి  అదృశ్యమయ్యే  వేళకి  ..

కలువలన్ని తమలో తాము ఒదిగిపోయే వేళకి ..

తూరుపు నుదుటిన  కుంకుమ మెరిసే వేళకి ..

కిలకిలారావాల సంగీతం వినిపించే వేళకి ..

గోధూళి నేలమ్మ కి రంగులద్దు తున్న వేళకి ..

దరికి చేరనివ్వని నన్ను చూసి నిదురమ్మవిసుగెత్తే వేళకి ..

విచ్చుకుంటున్న పూల సువాసన నాసిక ని తాకే వేళకి ..

వెలుగు రేఖలు అవని నిండా పరచుకుంటున్న వేళకి ..

నేను నీకోసం ఎదురు చూస్తున్నా ..

తూరుపు సూరీడు తో పాటే వస్తావని ..

నా బ్రతుకున కాంతులు వెదజల్లుతావని ..

ఆ కాంతి లో జీవితం అంతా గడిపేయాలని ఆశ ..

రెపరెపలాడిస్తున్న కనురేప్పల్లోంచి కలలు వేల్లువవుతున్నాయి ...

మునిపంట నొక్కిన పెదవి నిను చూసే దాకా విచ్చుకోనంది ..

ఇంతలోనే తెలిసింది గుండె పగిలే నిజమొకటి ..

నువ్వు వస్తున్నావు నాకోసం .. కానీ విధి ఆట ఆడింది .

రహదారి అంతా నీ నెత్తుటి వరద నా ఆశల్ని గండి కొట్టింది  ..

గిలగిల లాడుతున్న ప్రాణం విలవిల లాడింది ..

వేరొకరి నిర్లక్ష్యం నీ ప్రాణాన్ని ఎత్తుకెళ్ళింది ..

నన్ను చూడాలనే ఆశ నీ జీవం లేని కళ్ళలో అలాగే ఉంది ..

నా అడుగుల కింద భూమి కంపిస్తుంది ..

కలలు వెల్లువైన కళ్ళలో కన్నీటి సంద్రం  ఉప్పొంగుతుంది  

గుండె వేగం ఆగిపోతున్నట్టు ఉంది ..

నీ రూపమే కళ్ళ ముందు మెదలు తుంటే ..

గ్రహణం పట్టినట్టు లోకమంతా చీకటై పోయింది ..












- రోడ్ పై వాహనాలు నడిపే టప్పుడు , మీకూ కుటుంబం ఉన్నట్లే అవతలి వారికీ ఉంటుందని గుర్తుంచు కొండి .

ఏ ఒక్కరి నిర్లక్ష్యం , దుర్వ్యసనం వేరొకరి జీవితాలలో చీకట్లు తేకూడదు .

మీ ఇళ్ళల్లో మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు .. వారి ని ప్రేమించే వ్యక్తి గా వారి ఎదురు చూపుల్ని వృధా

కానివ్వ కండి . రోడ్ ప్రమాదాల్ని అరికడదాం .