కవితా హృదయం ...

ఓ అందమైన భావన .. అక్షరాల సుమ మాల గా కూరిస్తే ఓ కవిత గా రూపు దిద్దుకుంటుంది . ప్రకృతి పరవశమైనా .. చిరుగాలి పులకితమైనా ... మయూరం నర్తించినా .. మేఘం కరిగి వర్షించినా మనసు అందమైన భావనల్లో తేలియాడుతుంది .. నా భావన .. నా ఆలోచన .. నా రచనా శైలి .. మీతో పంచుకుందామని ఇలా కవితా హృదయం
పరిచా .. నచ్చితే ముచ్చట పడండి ..

Friday 25 April 2014

ఏమని చెప్పను ?



నేనెవరంటే ఏమని చెప్పను ?

నిశ్చల మైన సరస్సులో తరంగమని చెప్పనా ?

మేఘాన్ని కరిగించే చిరుగాలి నని చెప్పనా ?

తొలకరి జల్లు కి మురిసే అవని నని చెప్పనా ..

శిశిరపు విరహాన్ని తాళలేని వనాన్ని కౌగలించే వసంతాన్నని చెప్పనా ?

నింగి వీడి నేల జారిన ముత్యపు చినుకునని చెప్పనా ?

మావిచివురు తిని తీయగ పాడే కోయిలనని చెప్పనా ?

నీలాకాశం లో విహరించే విహంగాన్నని చెప్పనా ?

తొలిపొద్దు కిరణాల  చుంబన లో మురిసే జలపాతమని చెప్పనా ?

నెలరేడు ప్రణయ దాహాన్ని తీర్చే కోనేటి కలువనని చెప్పనా ?

అలుపెరగక సాగే  నదీమ తల్లి ప్రవాహ వేగాన్నని చెప్పనా ?

తుంటరిగా పూవన మంతా తిరిగే సీతాకోక చిలుక నని చెప్పనా ?

భావాల  వెల్లువని కవిత గా మలచే శిల్పి నని చెప్పనా?

 ఈ అంతర్జాలం లో ఇంద్రజాలం చేసి మీ మనసుల్ని దోచుకోవాలని వచ్చానని చెప్పనా ?

ఏమని చెప్పను ?




www.facebook.com/Naarachana

No comments:

Post a Comment