కవితా హృదయం ...

ఓ అందమైన భావన .. అక్షరాల సుమ మాల గా కూరిస్తే ఓ కవిత గా రూపు దిద్దుకుంటుంది . ప్రకృతి పరవశమైనా .. చిరుగాలి పులకితమైనా ... మయూరం నర్తించినా .. మేఘం కరిగి వర్షించినా మనసు అందమైన భావనల్లో తేలియాడుతుంది .. నా భావన .. నా ఆలోచన .. నా రచనా శైలి .. మీతో పంచుకుందామని ఇలా కవితా హృదయం
పరిచా .. నచ్చితే ముచ్చట పడండి ..

Thursday 29 May 2014

నన్నిలా బ్రతకనీ ...............

కరిగిపోయే క్షణాలని .. మరిగిపోయే మనసుని ..

నియంత్రించలేని అసహాయత అసమర్థత కాదులే ..

మరవలేని స్మృతులను . మరలరాని రోజులను ..

స్మరించకుండా ఉండలేకపోవటం అపరాధమయితే కాదులే ..

గుండె నిండా వెల్లువైన ప్రేమ తాకిడి కి ఆనకట్ట వేయలేని

కనుల చెలియలి కట్ట దాటిన కన్నీటి వరద నను ముంచనీ ..

పెదవి పైన మాసి పోని  పూల ఋతువు ని  ఆహ్వానించనీ ..

పొదివి పట్టి ఓదార్పు నిచ్చే మనసు కై వెతుకులాట సాగనీ ..

మసకబారిన  ఎద గూటిలో వెండి వెన్నెల  పరచు కొనే ..

రోజు కొరకు వేచి చూడటమే .. అలవాటుగా మార్చుకోనీ ..

నన్నిలా బ్రతకనీ ............... 

Wednesday 14 May 2014

నను మార్చిన హృదయం

ఇదుగో ఇపుడే కలిసెను హృదయం ..

నాలో నిశినే తరిమిన ఉదయం ..

సరికొత్తగా మొదలయ్యిందే నా జీవితమే ..

గమ్మత్తుగా నింపే సావే నీ జ్ఞాపకమే ..

ఎదలో అలజడి నీవే ప్రేమా .......  ఇదుగో ఇపుడే


నా వెచ్చని శ్వాసే.. నీ ఊపిరిగా మార్చావే ఓ మైనా ..

నీ చిక్కని వెన్నెల .. నా దారంతా పరిచావే ఏ మైనా ..

ఈ చీకటంతా ఏమైన దమ్మా ? నీ కాటుకల్లె మారిందే గుమ్మా ..

నా మొండి వైఖరి ని ప్రేమించే గుణమా ..        ఇదుగో ఇపుడే


నీ తలపే నన్ను మరచేలా చేస్తుంది ..

నీతో వలపే నన్ను లోకానికి చూపింది ..

సరికొత్త జన్మా .. మొదలైన దమ్మా .. నను నాకు చూపే దర్పణమే నీవమ్మా ..

నీ చిలిపి చేష్ట లను ప్రేమించే నమ్మా .. ఇదుగో ఇపుడే





Monday 5 May 2014

కాదా ?



చిగురాకు రెమ్మల్లో కూసిందిలే కోయిలా

ఆ తీపి రాగానికి పులకి0చిందిలే  ఈ ఇలా

ఏ రాగమైనా ఏ తాళ మైనా ఈ ప్రక్రుతి పులకింతలో తుళ్ళింత కాదా ?

ఆ నింగి అంచులలో మెరిసిందిలే వెన్నెలా

ఆ మెరుపు వెలుగులలో వెలిగిందిలే అవనే అలా

ఏ వెన్నెలైనా ఏ పున్నమైనా ఈ ప్రకృతి పులకింత లో గిలిగింత కాదా ?

ఈ పుడమి హద్దులలో పచ్చని సోయగాల ..

నును లేత కిరణాలే మేలుకొలిపేవేళా ..

ఏ ఉదయమో ఏ హృదయమో ఈ ప్రకృతి పులకింత లో తోలి వింత కాదా ?

ఆ కడలి కౌగిట్లో సుడులు తిరిగే నదిలా ..

తీరాన్ని తాకుతూ అల్లరే చేసే అలలా ..

ఏ కదలికో ఏ కలయికో ఈ ప్రక్రుతి పులకింతలో కవ్వింత కాదా ?






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది