కవితా హృదయం ...

ఓ అందమైన భావన .. అక్షరాల సుమ మాల గా కూరిస్తే ఓ కవిత గా రూపు దిద్దుకుంటుంది . ప్రకృతి పరవశమైనా .. చిరుగాలి పులకితమైనా ... మయూరం నర్తించినా .. మేఘం కరిగి వర్షించినా మనసు అందమైన భావనల్లో తేలియాడుతుంది .. నా భావన .. నా ఆలోచన .. నా రచనా శైలి .. మీతో పంచుకుందామని ఇలా కవితా హృదయం
పరిచా .. నచ్చితే ముచ్చట పడండి ..

Monday, 18 August 2014

చల్లగ కురిసెను వెన్నెలా .



       చల్లగ కురిసెను వెన్నెలా .. ఆ జల్లు కి తడసినదీ ఇలా ..

       పున్నమి  జాబిలి జిలుగులా ... సిరి వన్నెల పూతల తళుకులా  ..

       ఆ చంద్రుని నుండి జారిన ముత్యపు తునకల వానలా ...

       చీకటి నిండిన నింగిలో ముద్దొచ్చే వదనపు వెలుగులో ..

       అరవిచ్చిన గగనపు సీమ లో .. కొలువయిన తారల సేవలో ..

      పరచిన మబ్బుల తివాచీ .. పై రాచ ఠీవి ని ఒలికించి ..

      అంతరిక్షమే వీడి భువి న విహరించే వెన్నెలా .. వెలగవే మా కన్నుల .


      మెల్లగా ఇటువైపుగా తొంగి చూడకే అలా ..

      నిను దాచటం తన తరమా ఓడిపోదా మేఘమాల   .

      అల్లరి చిరుగాలితో స్నేహం చేసుకో ఇలా ..

      నునువెచ్చని అనుభూతి ని కలిగించు వెన్నెలా ..

      తళుకు మన్న తార కౌగిట కరిగుపోవు జాబిలి ప్రేమలా ..

      మిణుకు మన్న గ్రహాల సందిట పంచుకున్న తీపి ఊసులా ..

      వెల్లువైన విరహాల శుక్ల పక్షా న .. తుళ్లు తున్న యామినివై విస్తరించలా ..

      సంద్రమైనా , వనమైనా పులకరించు వేళలా ..

      వెన్నెలా .. సిరివెన్నెలా .. కురవాలి గా జడివానలా ..
    

Wednesday, 13 August 2014

ఎందుకు ?






తీయనైన కలలు కన్న కనుల నుండి జాలు వారు

కన్నీరు ఉప్పన .. ఎందుకు ?

కమ్మనైన మాటలెన్నో చెప్పిన నీ మనసు నాకు

చేదు జ్ఞాపకాలు పంచె నెందుకు ?

మధుర మైన వలపు లోన వగరు సెగల అలజడేందుకు ?

నమ్మకాన్ని వమ్ము చేసి బ్రతుకు తీరు మార్చావు ఎందుకు ?

అతివ గుండె వెన్నగాని, వెన్నుచూపి వెళ్ళిన నిన్ను క్షమించుటేందుకు ?

మరలి రాని తోడు నువ్వు .. నీడ లాగ భయపెడుతుoటావు ఎందుకు ?

వాడిపోయిన ఆశ లెన్నో .. చిగురు తొడగని జీవితాన వసంతం కై ఎదురు చూపులెందుకు ?

చినుకు లాంటి ఓదార్పు కోరిన బీడుబారిన మనసు లోన ఆషాడ మెప్పుడు రాదు ఎందుకు ?

కక్ష గట్టిన విధి యె ఇప్పుడు సంఘర్షణ నాలో రేపుట ఎందుకు ?

అంతు తెలియని ప్రశ్న లెన్నో నన్ను నిలదీయుటేందుకు ?



  

Friday, 4 July 2014

కవితా హృదయం ... : అనుకోని అతిథీ

కవితా హృదయం ... : అనుకోని అతిథీ: నే తలవని తలపువో .. మది పిలవని పిలుపుపో .. ఎద గూటికి అతిథి వో .. అనుకోని అతిథి వో .. ఎదురే చూడని కనులకు ఎదురుగా వచ్చావు .. ఎదరున్నది ఎ...

అనుకోని అతిథీ

నే తలవని తలపువో .. మది పిలవని పిలుపుపో ..

ఎద గూటికి అతిథి వో .. అనుకోని అతిథి వో ..

ఎదురే చూడని కనులకు ఎదురుగా వచ్చావు ..

ఎదరున్నది ఎడారి కాదాని వాసంతం చూపావు ..

కమ్మని భాష్యం చెప్పావు చెలిమి చలువలోనా

రమ్మని గమ్యం పిలిచేలా నా దారిని మల్లించావు ..

నువ్వు ఎవ్వరో .. తెలియదు .. ఊరు పేరు తెలియదు ..

మనసు ముత్యమని తెలుసు .. నీ నవ్వు వెన్నెలని తెలుసు ..

మరపురాని జ్ఞాపకాలకి ఆలవాలమని తెలుసు ..

కరిగిపోయినా కాలం .. తిరిగిరానిదే .. కానీ ..


ఉండిపోయానే నీకై ఆ చోటనే .. నేనిను కలసిన చోటనే ..

మరిగిపోవు నా మనసుని .. ఆపలేనుగాని ..

శిలను కానులే చెలి..  ఉలి తాకిన శిల్పాన్నే ...

నీ తీయని ఊహల లోకం లో జాగృతమైనది నా కల ..

నా తీరని మోహపు మైకంలో మమేకం అయినది చెలి అలా ..

ఎన్నాళ్ళు గడచినా నను వీడిపోదే .. ఎన్నేళ్ళు వేచినా చెలి జాడ లేదే ..

మది కడలి నే మధియించిన ఎడబాటు విషమేలే .. నీ ప్రేమ అమృత మవులె ...

రాకోయి అనుకోని అతిథీ .. మరల మరల నన్ను మధించ నీ తరమా ...
 

Thursday, 12 June 2014

ఎదురుచూపు ముగిసింది

ఎదురుచూస్తూనే కరిగిపోయే కాలం ..

ఎదురుపడగానే చెదిరిపోయే విరహం ..

గతము గతము తో పెనవేసి స్వాగతం చెప్పా భవితకి ..

అభిమతాన్ని ముందుంచి సమ్మతo  తెలిపా మనసుకి ..

గుండె లోన గుప్పుమన్న వలపు పరిమళమా ...

గొంతు దాటి పైకి రాని పలుకు నాపిన మౌనమా ...

కనులు కనులతో మాటలాడే వైనపు తరుణమా ..

కళలు నేర్పే కలలు పండే కమ్మని సమయమా ..

బాధ కింకా సెలవని పెదవి పై చిరునవ్వు రానీ ..

మండుటెండల వేసవిలోనే ఆమని రాకని తెలపనీ ..

ఈ దూరం .. దూరం కాగా .. మనసు తాకెను అంబరం ..

సింధూరం నుదుట మెరవగ .. తరుణి కిప్పుడు సంబరం ..

గాజుల గలగల నవ్వుల కిలకిల మల్లెల ముడుపుల సంతకం ..

వెన్నెల వెలుగుల ఆశల మణుగుల తీయని ఊహల సంతసం ..

ఇది కాదా .. అచ్చతెలుగు మగువ హృదయపు సహవాసం ..





Monday, 9 June 2014

ప్రేమ ఎపుడు కొత్త కావ్యమే ...



నా మది లోనా .. ఓ విరివానా .. కురిసిందే నీ వలనా ..

నీ వలలోనా .. పడ్డానే మైనా .. ఓడించావేమైనా ...

కన్నులలో కలవో నువ్వు .. కలవో నా కన్నులకి

వెన్నెలలో విహరిస్తావు... వన్నెలనే చిలికేస్తావు ..

ఆకాశం అంచుల నుంచి తుంటరిగా చూస్తావు ..

సంతోషపు సంచులు తెచ్చి  కానుకలే ఇస్తావు ..

మల్లెల తో పరుపులు వేసి సౌగంధం అవుతావు ..

నడిరాతిరి నైనా వదలక తలపుల్లో ఉంటావు ..

తేనె పలుకు ముత్యాలు చిమ్మగా .. వాన జాణ మరులు గొలపగా

నా చెంత న నువ్వుంటే నీ మాటలు వింటుంటే ఈలోకం అంటూ ఒక్కటి

ఉందని నే మరిచానే ..

నీ చింత లో నేను ఉండగా పులకింతలు రేపేటట్టుగా  ఆ స్వర్గం

నీరూపం లో నడచి వచ్చెనే ...

నెచ్చలి ఈ తొలకరి జల్లుల తడసినదీ నా మది ..

నా మది పై పరుగులు తీయకే .. అడుగు వెయ్యి నెమ్మది ..

ఝుమ్మని తుమ్మెద  తరిమేనే .. రమ్మని నా చెలి పిలిచేనే ..

ఆ పిలుపే మోహన రాగపు ఒరవడి నే తలపించేనే ..

అల్లరి ఊహలు రేగేనే .. అలజడి ఇక చెలరేగేనే ..

కవులెందరో రాసిన దైనా ప్రేమ ఎపుడు కొత్త కావ్యమే ...

Thursday, 29 May 2014

నన్నిలా బ్రతకనీ ...............

కరిగిపోయే క్షణాలని .. మరిగిపోయే మనసుని ..

నియంత్రించలేని అసహాయత అసమర్థత కాదులే ..

మరవలేని స్మృతులను . మరలరాని రోజులను ..

స్మరించకుండా ఉండలేకపోవటం అపరాధమయితే కాదులే ..

గుండె నిండా వెల్లువైన ప్రేమ తాకిడి కి ఆనకట్ట వేయలేని

కనుల చెలియలి కట్ట దాటిన కన్నీటి వరద నను ముంచనీ ..

పెదవి పైన మాసి పోని  పూల ఋతువు ని  ఆహ్వానించనీ ..

పొదివి పట్టి ఓదార్పు నిచ్చే మనసు కై వెతుకులాట సాగనీ ..

మసకబారిన  ఎద గూటిలో వెండి వెన్నెల  పరచు కొనే ..

రోజు కొరకు వేచి చూడటమే .. అలవాటుగా మార్చుకోనీ ..

నన్నిలా బ్రతకనీ ...............