కవితా హృదయం ...

ఓ అందమైన భావన .. అక్షరాల సుమ మాల గా కూరిస్తే ఓ కవిత గా రూపు దిద్దుకుంటుంది . ప్రకృతి పరవశమైనా .. చిరుగాలి పులకితమైనా ... మయూరం నర్తించినా .. మేఘం కరిగి వర్షించినా మనసు అందమైన భావనల్లో తేలియాడుతుంది .. నా భావన .. నా ఆలోచన .. నా రచనా శైలి .. మీతో పంచుకుందామని ఇలా కవితా హృదయం
పరిచా .. నచ్చితే ముచ్చట పడండి ..

Thursday, 12 June 2014

ఎదురుచూపు ముగిసింది

ఎదురుచూస్తూనే కరిగిపోయే కాలం ..

ఎదురుపడగానే చెదిరిపోయే విరహం ..

గతము గతము తో పెనవేసి స్వాగతం చెప్పా భవితకి ..

అభిమతాన్ని ముందుంచి సమ్మతo  తెలిపా మనసుకి ..

గుండె లోన గుప్పుమన్న వలపు పరిమళమా ...

గొంతు దాటి పైకి రాని పలుకు నాపిన మౌనమా ...

కనులు కనులతో మాటలాడే వైనపు తరుణమా ..

కళలు నేర్పే కలలు పండే కమ్మని సమయమా ..

బాధ కింకా సెలవని పెదవి పై చిరునవ్వు రానీ ..

మండుటెండల వేసవిలోనే ఆమని రాకని తెలపనీ ..

ఈ దూరం .. దూరం కాగా .. మనసు తాకెను అంబరం ..

సింధూరం నుదుట మెరవగ .. తరుణి కిప్పుడు సంబరం ..

గాజుల గలగల నవ్వుల కిలకిల మల్లెల ముడుపుల సంతకం ..

వెన్నెల వెలుగుల ఆశల మణుగుల తీయని ఊహల సంతసం ..

ఇది కాదా .. అచ్చతెలుగు మగువ హృదయపు సహవాసం ..





Monday, 9 June 2014

ప్రేమ ఎపుడు కొత్త కావ్యమే ...



నా మది లోనా .. ఓ విరివానా .. కురిసిందే నీ వలనా ..

నీ వలలోనా .. పడ్డానే మైనా .. ఓడించావేమైనా ...

కన్నులలో కలవో నువ్వు .. కలవో నా కన్నులకి

వెన్నెలలో విహరిస్తావు... వన్నెలనే చిలికేస్తావు ..

ఆకాశం అంచుల నుంచి తుంటరిగా చూస్తావు ..

సంతోషపు సంచులు తెచ్చి  కానుకలే ఇస్తావు ..

మల్లెల తో పరుపులు వేసి సౌగంధం అవుతావు ..

నడిరాతిరి నైనా వదలక తలపుల్లో ఉంటావు ..

తేనె పలుకు ముత్యాలు చిమ్మగా .. వాన జాణ మరులు గొలపగా

నా చెంత న నువ్వుంటే నీ మాటలు వింటుంటే ఈలోకం అంటూ ఒక్కటి

ఉందని నే మరిచానే ..

నీ చింత లో నేను ఉండగా పులకింతలు రేపేటట్టుగా  ఆ స్వర్గం

నీరూపం లో నడచి వచ్చెనే ...

నెచ్చలి ఈ తొలకరి జల్లుల తడసినదీ నా మది ..

నా మది పై పరుగులు తీయకే .. అడుగు వెయ్యి నెమ్మది ..

ఝుమ్మని తుమ్మెద  తరిమేనే .. రమ్మని నా చెలి పిలిచేనే ..

ఆ పిలుపే మోహన రాగపు ఒరవడి నే తలపించేనే ..

అల్లరి ఊహలు రేగేనే .. అలజడి ఇక చెలరేగేనే ..

కవులెందరో రాసిన దైనా ప్రేమ ఎపుడు కొత్త కావ్యమే ...

Thursday, 29 May 2014

నన్నిలా బ్రతకనీ ...............

కరిగిపోయే క్షణాలని .. మరిగిపోయే మనసుని ..

నియంత్రించలేని అసహాయత అసమర్థత కాదులే ..

మరవలేని స్మృతులను . మరలరాని రోజులను ..

స్మరించకుండా ఉండలేకపోవటం అపరాధమయితే కాదులే ..

గుండె నిండా వెల్లువైన ప్రేమ తాకిడి కి ఆనకట్ట వేయలేని

కనుల చెలియలి కట్ట దాటిన కన్నీటి వరద నను ముంచనీ ..

పెదవి పైన మాసి పోని  పూల ఋతువు ని  ఆహ్వానించనీ ..

పొదివి పట్టి ఓదార్పు నిచ్చే మనసు కై వెతుకులాట సాగనీ ..

మసకబారిన  ఎద గూటిలో వెండి వెన్నెల  పరచు కొనే ..

రోజు కొరకు వేచి చూడటమే .. అలవాటుగా మార్చుకోనీ ..

నన్నిలా బ్రతకనీ ............... 

Wednesday, 14 May 2014

నను మార్చిన హృదయం

ఇదుగో ఇపుడే కలిసెను హృదయం ..

నాలో నిశినే తరిమిన ఉదయం ..

సరికొత్తగా మొదలయ్యిందే నా జీవితమే ..

గమ్మత్తుగా నింపే సావే నీ జ్ఞాపకమే ..

ఎదలో అలజడి నీవే ప్రేమా .......  ఇదుగో ఇపుడే


నా వెచ్చని శ్వాసే.. నీ ఊపిరిగా మార్చావే ఓ మైనా ..

నీ చిక్కని వెన్నెల .. నా దారంతా పరిచావే ఏ మైనా ..

ఈ చీకటంతా ఏమైన దమ్మా ? నీ కాటుకల్లె మారిందే గుమ్మా ..

నా మొండి వైఖరి ని ప్రేమించే గుణమా ..        ఇదుగో ఇపుడే


నీ తలపే నన్ను మరచేలా చేస్తుంది ..

నీతో వలపే నన్ను లోకానికి చూపింది ..

సరికొత్త జన్మా .. మొదలైన దమ్మా .. నను నాకు చూపే దర్పణమే నీవమ్మా ..

నీ చిలిపి చేష్ట లను ప్రేమించే నమ్మా .. ఇదుగో ఇపుడే





Monday, 5 May 2014

కాదా ?



చిగురాకు రెమ్మల్లో కూసిందిలే కోయిలా

ఆ తీపి రాగానికి పులకి0చిందిలే  ఈ ఇలా

ఏ రాగమైనా ఏ తాళ మైనా ఈ ప్రక్రుతి పులకింతలో తుళ్ళింత కాదా ?

ఆ నింగి అంచులలో మెరిసిందిలే వెన్నెలా

ఆ మెరుపు వెలుగులలో వెలిగిందిలే అవనే అలా

ఏ వెన్నెలైనా ఏ పున్నమైనా ఈ ప్రకృతి పులకింత లో గిలిగింత కాదా ?

ఈ పుడమి హద్దులలో పచ్చని సోయగాల ..

నును లేత కిరణాలే మేలుకొలిపేవేళా ..

ఏ ఉదయమో ఏ హృదయమో ఈ ప్రకృతి పులకింత లో తోలి వింత కాదా ?

ఆ కడలి కౌగిట్లో సుడులు తిరిగే నదిలా ..

తీరాన్ని తాకుతూ అల్లరే చేసే అలలా ..

ఏ కదలికో ఏ కలయికో ఈ ప్రక్రుతి పులకింతలో కవ్వింత కాదా ?






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 28 April 2014

క్షమించవా నా హృదయమా ..


నీ కల నేను...........   జ్ఞాపకాల వల నేను 

నీ మనసు తీరాన్ని మరల మరల తాకే అల నేను .. 

కమ్మని కబుర్లు విన్నాను .. రమ్మను నీ పిలుపులు విన్నాను .. 

తీయని మాటలు చెప్పాను .. మాయని తలపులు విప్పాను .. 

నీ గుస గుసల అలజడి నేనేను .. నీ కస్సుబుస్సుల సందడి నాదేను .. 

నీ ఎదురు చూపు లో ప్రాణం పోసుకుంటాను .. 

నీ దారి ప్రతి మలుపునా ఎదురై నిలిచాను .. 

నీ భావి ని కావాలని ఆశించాను .. రవి నై చీకటిని తరమాలని భావించాను .. 

ఎదగూటిలో దేవత గా కొలవాలనుకున్నాను .. 

ఎప్పటికీ నీ పై నా ఆరాధనని చాటి చెప్పాలనుకున్నాను .. 

కానీ నా మాట మౌనమై .. నీనుండి దూరమై నిశీధి లో నియంత నయాను .. 

నీ వాలు కళ్ళల్లో కన్నీటిని నింపి ఆ వెల్లువలో కొట్టుకుపోయాను .. 

నీలో నను నేను కోల్పోయాను .. నాకు నేను మిగలక జీవచ్చవమై మిగిలాను .. 

ఈ మనసు లేనివాడిని క్షమించగలవా అని అడగలేని అసహాయత లో కొట్టుమిట్టాడు తున్నాను .. 


Friday, 25 April 2014

అందమైన లోకం

ఎందుకో కొత్త గా కనిపిస్తున్నది ఈ లోకం ..                                  

రోజుకో వింతలా కవ్విస్తున్నది  భూలోకం

రెక్కలు విప్పిన యవ్వనం చేసింది  గగన విహారం

రేకులు విచ్చిన పూవనం వేసింది ఓ సుమహారం

గల గల పారే సెలయేరే మంది ? నా కిల కిల నవ్వే తనదంది ..

మిల మిల మెరిసే తారక ఏమంది ? తన మిసమిస సొగసే నాదంది ..

కొమ్మల్లో కోయిలా .. కూసిందిలే ఇలా .. కుహు కుహు పాటలా .. సరిగమల తోటల  ..

మెరిసేటి వెన్నెలా .. కురిసింది జోలలా .. నిదురించు వేళలా .. కలలు నా కన్నులా ..

సరికొత్తగా .. గమ్మత్తుగా ఊయలూపింది లోకమే ఇలా ..


పూవు ల భాష ఏదో .. తుమ్మెదా..  నీకు తెలుసేమో ..

చిరుగాలి ఊసుల్ని వింటూ పైరు తల ఊపుతుందేమో ..

నింగి చెక్కిలి పైన .. సిగ్గు ఒలికించు స్సూరీడు .. మబ్బుల చీర తెచ్చి .. కానుకే ఇచ్చి ఉంటాడు .

వేకువ వాకిలి లోనా .. ముగ్గు పెట్టేవాడు .. హరివిల్లు రంగులు కూర్చి .. చిరుజల్లు కురిపించుంటాడు ..

ఆనందమా .. ఆహ్లాదమా ? ఈ జగతిలో ఇంతందమా ?

పచ్చాని రాచిలుక  కమ్మని పలుకులా

మా వూరి రహదారి మెలికల  కులుకుల ..

సిరి మువ్వ సవ్వళ్ళ..  దోబూచు లాట లో  .. గోధూళి వేళలో .. కన్నె దూడ సంబరాలు

సందె పొద్దు నీడలోనా  .. .. తెల్లవారు పల్లె లోనా  .. మంచు జాణ ఇలకి చేర .. విచ్చు  మందారాలు

చాలవేమో కళ్ళు రెండు .. సొగసులద్దిన ప్రకృతిని చూడ ..









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది